ఫిబ్రవరి 10న ఉత్తర్వులు జారీ అవకాశం - శేరిలింగంపల్లి, హైదరాబాద్, మల్కాజిగిరి పేర్లతో కొత్త కార్పొరేషన్లు


Green Signal for GHMC Bifurcation: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం చివరి సన్నాహాలు పూర్తి చేసింది. ఈ నెల 10న ఈ విభజనకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ గడువు ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో, అదే రోజు విభజన ఆదేశాలు జారీ చేసి, మూడు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు బాటలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఏర్పడే కార్పొరేషన్లు శేరిలింగంపల్లి, హైదరాబాద్, మల్కాజిగిరి పేర్లతో ఉండనున్నాయి.

ఈ మూడు కార్పొరేషన్లకు ఫిబ్రవరి 10 నుంచి ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఆగస్టు నెలలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.

రాజధాని హైదరాబాద్ నగర అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బాహ్య రింగ్ రోడ్ పరిధిలోని 27 మున్సిపాల్టీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది. దీంతో ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా నిలిచిన జీహెచ్‌ఎంసీని పరిపాలనా సౌలభ్యం కోసం మూడుగా విభజించాలని నిర్ణయించింది.

పరిపాలన సుగమంగా సాగేందుకు పోలీసు, మున్సిపల్ శాఖల సరిహద్దులు ఏకరూపంగా ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ (మల్కాజిగిరిగా పేరు మార్చబడినది) పోలీసు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించిన విధంగానే జీహెచ్‌ఎంసీ విభజన కూడా జరగనుంది.

ఫ్యూచర్‌సిటీ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో శేరిలింగంపల్లి కార్పొరేషన్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి పరిధిలో మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక. ఇటీవల జరిగిన బదిలీల్లో ఐఏఎస్ అధికారులు వినయ్‌కృష్ణారెడ్డి, సృజనలను జీహెచ్‌ఎంసీకి అదనపు కమిషనర్లుగా పంపడం ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. ప్రస్తుత కమిషనర్ కర్ణన్‌ను కొనసాగిస్తూ, సృజనను శేరిలింగంపల్లికి, వినయ్‌కృష్ణారెడ్డిని మల్కాజిగిరికి ప్రత్యేక కమిషనర్లుగా నియమించే అవకాశం ఉందని సమాచారం.

ఈ విభజనతో హైదరాబాద్ నగర పరిపాలన మరింత సమర్థవంతంగా, స్థానిక అవసరాలకు తగినట్లు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story