Pod Car Transport System: హైదరాబాద్‌లో పాడ్ కార్ల రవాణాకు గ్రీన్ సిగ్నల్.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ ఆమోదం
సీఎం రేవంత్ ఆమోదం

Pod Car Transport System: పాడ్ కార్లతో నడిచే అధునాతన రవాణా వ్యవస్థ పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్)లో మూడు మార్గాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మార్గాల టెండర్ల ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని మెట్రోరైలు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీఈలోని బోధి పెవిలియన్‌లో పీఆర్‌టీఎస్‌పై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు.
పీఆర్టీఎస్ మార్గాలపై లీ అసోసియేట్స్ అధ్యయన నివేదికపై ఇటీవలే మెట్రో అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. ఆ మేరకు చేసిన మార్పుల ఆధారంగా మూడు మార్గాలను ఎంపిక చేశారు. కేపీహెచ్బి మెట్రోస్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ మెట్రోస్టేషన్ వరకు మార్గాన్ని వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు.
గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలన్నారు. ఏడాదిలో ఈ లైన్ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఎల్బీ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం, ఇందిరాపార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాణిగంజ్ బస్‌స్టాండ్ వరకు మరో లైన్ ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీ మెట్రో నుంచి రవీంద్ర భారతి, సెక్రటేరియట్, ఐమాక్స్ నుంచి బేగంపేట్‌ను కలుపుతూ ఇంకో మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
నెక్లెస్ రోడ్లో మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అధునాతన రవాణా వ్యవస్థ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా రూపొందుతోంది. పాడ్ కార్లు వ్యక్తిగత స్థాయిలో ప్రయాణాన్ని సాధ్యం చేస్తాయి. టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సమీక్ష సమావేశంలో సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో అదనపు ఎండీ అజిత్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక పాల్గొన్నారు. నగర రవాణా వ్యవస్థను ఆధునీకరించే దిశగా ఈ ప్రాజెక్టు కీలకమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

