Minister Ponguleti: 22ఏ భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్.. నాలా అనుమతి లేకున్నా రిజిస్టర్ చేసుకోవచ్చు: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Minister Ponguleti: తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 22-ఎ భూముల రిజిస్ట్రేషన్ సమస్యకు ప్రభుత్వం కీలక పరిష్కారం చూపింది. నాలా (NALA) అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన అర్హత ఉన్న పట్టా భూములను ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
మెమో నెం. 48062/ULC/A1/2026 ద్వారా జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, నాలా రుసుము చెల్లించి అర్హత ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకు ముందు జీవో 118, జీవో 76 మరియు ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు కొన్ని ఉత్తర్వులు జారీ చేసినా, తాజాగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు ఉన్న 22-ఎ ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతి ఇచ్చారు.
ఈ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో పూర్తి చిత్తశుద్ధితో అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. యూఎల్‌సీ (ULC), నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అర్హులైన దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత కాలపరిమితిలోగా సేవలు అందించాలని, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కూడా ఆయన సూచించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సంస్కరణలు భూయజమానులకు గొప్ప ఉపశమనం కలిగించనున్నాయి.

