Congress Protest: కాంగ్రెస్ నిరసన నేపథ్యంలో గాంధీభవన్ వద్ద భారీ పోలీసు మోహరింపు.. ఉద్రిక్త పరిస్థితులు
గాంధీభవన్ వద్ద భారీ పోలీసు మోహరింపు.. ఉద్రిక్త పరిస్థితులు

Congress Protest: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై రాజకీయ కక్షతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం) వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడి నుంచి నంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం (శ్యామా ప్రసాద్ ముఖర్జీ భవన్) వైపు కాంగ్రెస్ నాయకులు నిరసన మార్చ్ చేపట్టే ప్రయత్నం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితర సీనియర్ నాయకులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అయితే ఏదైనా అవాంఛిత ఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు గాంధీభవన్ గేట్లు మూసివేశారు. నాయకులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ ముందు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా నిరసనలో పాల్గొన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రద్దీగా ఉండే రోడ్డుపై ధర్నా కారణంగా కొంతసేపు ట్రాఫిక్ ఆటంకం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు ఈడీ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఫాసిస్ట్ విధానాలకు చెంపదెబ్బ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

