ఉద్యోగులు అప్రమత్తంగా ఉండండి!

Heavy Rain in Hyderabad: నగరంలో గురువారం (సెప్టెంబర్ 25, 2025) అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎర్రమంజిల్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఫిలింనగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్, కాంచన్‌బాగ్, బండ్లగూడ, ఛత్రినాక, శాలిబండ, బేగంపేట్, రాణిగంజ్, ప్యారాడైజ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, అడ్డగుట్ట, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, బన్సీలాల్‌పేట్, మోండా మార్కెట్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక వంటి ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది.

కొనసాగుతున్న వర్షం కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్‌లతో అవస్థలు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమై, వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. మరో రెండు గంటల పాటు హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో రాబోయే 23 గంటల్లో వర్ష సూచన:

వచ్చే 23 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో తేలికపాటి వర్షం, గంటకు 40 కి.మీ. కంటే తక్కువ వేగంతో గాలులతో కూడిన ఉరుముల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, గంటకు 41-61 కి.మీ. వేగంతో గాలులతో కూడిన ఉరుముల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story