ఉత్తర బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం

కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు చెపుతున్నారు. మరో 24 గంటల వ్యవధిలో ఉత్తర బంగాళాఖాతంలో అల్పనీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఒడిషా దక్షిణ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నానికి సమీపంలో సముద్ర మట్టానికి సుమారుగా ఆరు మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి సమాంతరంగా దక్షిణ చత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండు ఆవర్తనాల ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో రేపు గురువారం అల్పపీడనం ఏర్పడే పరిస్ధితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పాటు తెలంగాణలో సైతం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనాల కారణంగా తెలంగాణ లో కూడా మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ నగరాన్నైతే గత పన్నెండు గంటల నుంచి వర్షం ముంచెత్తుతోంది. నగరం నలుమూలలా వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మంగళవారం రాత్రి తెల్లవార్లు కురిసిన వర్షం బుధవారం ఉదయం కూడా కొనసాగడంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, వరంగల్‌ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో దాదాపు 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వాటర్‌ మెన్‌ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ సూచించింది

Politent News Web 1

Politent News Web 1

Next Story