Hidma Encounter Deals a Major Blow to PLGA: హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పీఎల్జీఏకు తీరని దెబ్బ.. మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనం
మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనం

Hidma Encounter Deals a Major Blow to PLGA: మావోయిస్టు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కు భారీ నష్టం ఎదురైంది. కేంద్ర కమిటీ సభ్యుడు, బెటాలియన్ కమాండర్ స్థాయిలో మిలిటరీ ఆపరేషన్లకు నేతృత్వం వహించిన మాద్వి హిడ్మా (మడ్కం హిడ్మా) ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో పీఎల్‌జీఏ పూర్తిగా కకావికలమైనట్టయింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా భారత్‌లోని మావోయిస్టు ఉద్యమానికి హిడ్మా వెన్నెముకలా ఉండగా, అతని మరణంతో గెరిల్లా సైన్యం దాదాపు అస్తిత్వం కోల్పోయినట్టు భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సీపీఐ (మావోయిస్టు) పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు కీలకంగా ఉండే పీఎల్‌జీఏ.. ఒకప్పుడు 8 బెటాలియన్లు, 13 ప్లటూన్లతో 10 నుంచి 12 వేల మంది సాయుధ సభ్యులను కలిగి ఉండేది. 2004లో సీపీఐ-పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ) విలీనంతో ఏర్పడిన మావోయిస్టు పార్టీలో ఇది పీఎల్‌జీఏగా రూపాంతరం చెందింది. అయితే ఆపరేషన్ గ్రీన్‌హంట్, ప్రహార్, కాగార్ వంటి భద్రతా దళాల దాడులతో దశాబ్దకాలంగా బెటాలియన్లు ఒక్కొక్కటిగా నిర్వీర్యమయ్యాయి.
హిడ్మా నేతృత్వంలోని మొదటి బెటాలియన్ మాత్రమే ఇప్పటివరకు చైతన్యవంతంగా కొనసాగుతూ వచ్చింది. ఇటీవల హిడ్మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జెడ్సీ) బాధ్యతలు చేపట్టడంతో ఆ బెటాలియన్‌కు బర్సేదేవా నాయకత్వం వహించారు. ఆ బెటాలియన్‌లోని కంపెనీ-1కి లెంగు, కంపెనీ-2కి కల్లు, కంపెనీ-3కి లక్కు నేతృత్వం వహిస్తున్నారు. నాయకత్వం మారినా హిడ్మా ప్రభావం ఆ బెటాలియన్‌పై బలంగా ఉండేది.
పీఎల్‌జీఏ చరిత్రలో మరో మైలురాయి 1999 డిసెంబరు 2న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొయ్యూరులో జరిగిన ఎన్‌కౌంటర్. ఆ సంఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి (శ్యాం), ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి (మహేశ్), ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి శీలం నరేశ్ ఒకేసారి మరణించారు. వారి నివాళిగా 2000 డిసెంబరు 2న పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీజీఏ)ని స్థాపించారు. అదే 2004లో పీఎల్‌జీఏగా మారింది.
హిడ్మా మరణంతో ఇక పీఎల్‌జీఏ మిలిటరీ కార్యకలాపాలు దాదాపు స్తంభించినట్టేనని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమానికి ఇది రెండున్నర దశాబ్దాలలో అతి పెద్ద దెబ్బగా పరిణమించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

