High Court : కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యంతర బెయిల్‌పై శుక్రవారం తీర్పు వెలువరిస్తామని, ముందస్తు బెయిల్‌పై వచ్చే వారం విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది.

పిటిషనర్ భగీరథ్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి, పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. భగీరథ్ తరఫు న్యాయవాది బాధితురాలి వయసు విషయంలో కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల ఛార్జ్‌షీట్‌లో ఆమె వయసు 15 ఏళ్లుగా ఉన్నప్పటికీ, జీహెచ్‌ఎంసీ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్‌లో 2008 సంవత్సరం, పాన్ కార్డులో 2010 సంవత్సరం ఉన్నట్లు చెప్పారు. 2021లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆమె 15 ఏళ్ల వయసులోనే పట్టుబడినట్లు కూడా కోర్టుకు తెలిపారు.

ఛార్జ్‌షీట్‌, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్లలో పుట్టిన తేదీలు విభేదిస్తున్నందున హైకోర్టు ప్రశ్నించింది. బాధితురాలి జనన ధ్రువీకరణ పత్రాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

వాదనల సందర్భంగా బాధితురాలి తరఫు న్యాయవాది భగీరథ్‌ను ‘క్రిమినల్‌’ అని సంబోధించడంపై పిటిషనర్ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వైపులా వాగ్వాదం చెలరేగడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేరం నిరూపణం కాకముందే ఎవరినీ క్రిమినల్ అని పిలవకూడదని స్పష్టం చేశారు. న్యాయవాదులు సంయమనం పాటించకపోతే పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేస్తామని హెచ్చరించారు.

ఈ కేసు సంబంధించి హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందని రాజకీయ, న్యాయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story