Revanth Reddy: లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించిన ఈ రోజును భారతదేశ చరిత్రలో మరపురాని దినంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రతిపక్షాలు ఏకమై జాతీయ విపత్తును నివారించిన ఈ శుక్రవారం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

పార్లమెంటులో ప్రజాస్వామ్య శక్తులు ఏకత చూపినందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఎక్స్‌లో ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్దవ్‌ఠాక్రే, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు లాలూప్రసాద్‌యాదవ్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్, జమ్మూ కాశ్మీర్ నాయకుడు ఫరూఖ్‌అబ్దుల్లా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు సహా అందరూ ఈ పోరాటంలో సాహసంతో, ఐక్యంగా నిలిచారని సీఎం వివరించారు.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులో భాజపా చేసిన ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కావని ఆది నుంచి రేవంత్‌రెడ్డి గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ సీట్లు పెంచే విధానం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైన ఎం.కె. స్టాలిన్, సిద్ధరామయ్య, చంద్రబాబునాయుడుకు ముందే లేఖలు రాశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదని ఆ లేఖల్లో తీవ్రంగా హెచ్చరించారు.

దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతే, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మాత్రమే లాభపడే పరిస్థితి ఏర్పడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి వాదన జాతీయ స్థాయిలో హల్‌చల్ సృష్టించింది. అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా ‘హైబ్రిడ్ మోడల్‌’ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాసి, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఏకాభిప్రాయం ద్వారా మాత్రమే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి సూచించారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశం కాబట్టి అత్యవసరంగా, బాధ్యతతో ఈ లేఖ రాసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ బిల్లు ఓటమి దక్షిణ భారతదేశ రాష్ట్రాల హక్కులను కాపాడిన చారిత్రక విజయంగా పరిగణించాలని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story