Hyderabad Becomes a Mega City: మెగా నగరంగా హైదరాబాద్! జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం!
జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం!

మంత్రివర్గం కీలక నిర్ణయం.. ఓఆర్‌ఆర్ వరకూ రాష్ట్ర రాజధాని విస్తరణ
Hyderabad Becomes a Mega City: హైదరాబాద్ మహా నగరం మరింత విస్తరించి బృహత్ నగరంగా మారనుంది. బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్) లోపల, దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర, పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని విలీనం చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలంది. అందుకు అవసరమైన జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విలీన ప్రక్రియ ముగిశాక... ఐదు జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో ఆరు పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న పురపాలక, నగరపాలక సంస్థలన్నింటినీ విలీనం చేసి జీహెచ్‌ఎంసీని బృహత్ నగరంగా విస్తరిస్తాం. ఈ ప్రతిపాదన చాలా సంవత్సరాలుగా ఉంది. ప్రజాప్రభుత్వం దాన్ని అమలు చేస్తోంది. నగరంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అందిస్తున్న పరిపాలన పూర్తిగా ఒకేవిధంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ మహా విలీనం ప్రక్రియ చేపట్టాం. విలీనం పూర్తయ్యాక బృహత్ నగరాన్ని ఎన్ని కార్పొరేషన్లు విభజించాలి... ఏవిధంగా చేయాలనే నిర్ణయాలను ప్రస్తుతం ఏమీ తీసుకోలేదు. జీహెచ్‌ఎంసీ ప్రస్తుత నగరపాలక సంస్థ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. అనంతరం 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి చట్ట సవరణలు చేస్తాం. ఆ తర్వాతే ఎన్నికలు ఉంటాయి’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.
బృహత్ నగరంలో పరిపాలన సాఫీగా జరిగేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం ఉన్నతాధికారులను ఆదేశించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ జనాభా 1.45 కోట్లు. ఓఆర్‌ఆర్ వరకు నగరాన్ని విస్తరిస్తే దాదాపు 1.70 కోట్లకు చేరుతుంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో అది రెండు కోట్లుగా తేలే అవకాశముందని నిపుణుల అంచనా. అప్పుడు దేశంలోని పలు చిన్న రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా ఏర్పడే బృహత్ హైదరాబాద్ నగర జనాభానే అధికంగా ఉంటుంది.
మరోవైపు ఓఆర్‌ఆర్ వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తుండగానే... శివారు ప్రాంతాల విలీన ప్రక్రియ పట్టాలెక్కడం గమనార్హం. ఈ విలీనం ద్వారా హైదరాబాద్ సువిశాల నగరంగా అందరికీ మరింత మెరుగైన సేవలు అందించగలదని ప్రభుత్వం ఆశిస్తోంది.

