BuiltTrust GCC: నైపుణ్య మానవ వనరుల కేంద్రంగా హైదరాబాద్.. బిల్ట్‌ట్రస్ట్ జీసీసీ ప్రారంభం
ప్రారంభం

BuiltTrust GCC: నైపుణ్యం కలిగిన మానవ వనరులకు హైదరాబాద్ చిరునామాగా నిలుస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. టీ-హబ్, స్కిల్ యూనివర్సిటీ, టాస్క్ వంటి సంస్థల ద్వారా స్థానిక యువతకు అత్యుత్తమ శిక్షణ అందుబాటులో ఉందని, ఐటీ కంపెనీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి మానవ వనరులను నేరుగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.
మాదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్ ఐటీ పార్కులో ప్రముఖ బీ2బీ క్యాష్ జనరేషన్ ప్లాట్‌ఫామ్ ‘బిల్ట్‌ట్రస్ట్’ నూతనంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ)ను సోమవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది 75కు పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఇది దేశంలోనే అత్యధికమని చెప్పారు. హైదరాబాద్‌లో ఏఐ ఫస్ట్ జీసీసీ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన బిల్ట్‌ట్రస్ట్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
బిల్ట్‌ట్రస్ట్ సీఈవో గ్రాంట్ హల్లోరన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ సహకారం, అద్భుతమైన మౌలిక వసతుల కారణంగానే హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బిల్ట్‌ట్రస్ట్ ఇండియా జీసీసీ హెడ్ ఫర్హాద్ హెచ్.బారియా తదితరులు పాల్గొన్నారు.

