Minister Sridhar Babu: హైదరాబాద్‌ను గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దాలి: మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి శ్రీధర్‌బాబు

Minister Sridhar Babu: హైదరాబాద్‌ను కేవలం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల గమ్యస్థానంగా మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలు అందించే ‘గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్’గా తీర్చిదిద్దాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
గ్లోబల్ మార్కెట్ అవసరాలు, సవాళ్లు, భవిష్యత్ సాంకేతిక మార్పులకు అనుగుణంగా దిగ్గజ కంపెనీలను ఆకర్షించే సమగ్ర ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. హైటెక్ సిటీలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన నెదర్లాండ్స్ గ్లోబల్ ఫిన్‌టెక్ దిగ్గజం ‘బ్యాక్‌బేస్’ సంస్థ డెవలప్‌మెంట్ సెంటర్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన.. ‘‘అనతికాలంలోనే టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో హైదరాబాద్‌ను గ్లోబల్ కంపెనీలకు ప్రముఖ గమ్యస్థానంగా మారుస్తాం. గ్లోబల్ కంపెనీల అవసరాలకు తగిన అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు అందించడంలో ఈ బ్యాక్‌బేస్ డెవలప్‌మెంట్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ యాన్ క్రెమర్స్, బ్యాక్‌బేస్ సీటీఓ గ్రెగ్ ఫాహి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రీన్‌హార్డ్ షీల్, ఇండియా సైట్ హెడ్ సురభి శర్మ తదితరులు పాల్గొన్నారు.

