Kishan Reddy: హైదరాబాద్‌ను ల్యాండ్ మాఫియా రహిత నగరంగా మార్చాలి: కిషన్‌రెడ్డి
కిషన్‌రెడ్డి

Kishan Reddy: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఉన్న గుర్తింపు ఎంతైతే, స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగంలో హైదరాబాద్‌కు కూడా అదే స్థాయి గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. నరెడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్) ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రాపర్టీ షో ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను ల్యాండ్ మాఫియా, భూకబ్జాలు లేని నగరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి కోసం స్థలాలు తీసుకున్న తర్వాత కోర్టు లిటిగేషన్ల కారణంగా బిల్డర్లు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం, న్యాయస్థానాలు, నరెడ్కో సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. రియల్ ఎస్టేట్ రంగం ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలని, ఆయా ప్రాంతాల్లో చిన్న రియల్ ఎస్టేట్ సంస్థలను ప్రోత్సహించి కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచే బాధ్యతను నరెడ్కో తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర జనాభాలో సుమారు 50 శాతం మందికి సేవలు అందించే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందజేస్తుందని తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే రియల్ ఎస్టేట్ విస్తరణకు మహర్దశ పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల రంగానికి ప్రాధాన్యం ఇస్తోందని, హైదరాబాద్ అనుసంధానతను పెంచేందుకు మూడు ప్రధాన బుల్లెట్ రైలు కారిడార్ల ప్రాథమిక పనులు సాగుతున్నాయని, మెట్రో రెండో విడత పనులకు కేంద్రం సానుకూలంగా ఉందని వివరించారు.
కార్యక్రమంలో ప్రాపర్టీ షోలో ఉత్తమ స్టాల్స్ ఏర్పాటు చేసిన సంస్థలకు కిషన్‌రెడ్డి అవార్డులు అందజేశారు. నరెడ్కో నెక్ట్స్ జెన్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు కె. శ్రీధర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ ఆర్. వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు కాళీప్రసాద్ దామెర, కె. గోపాలకృష్ణ, సభ్యులు అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

