Hyderabad on High Alert After Delhi Blast: ఢిల్లీ పేలుడు తర్వాత హైదరాబాద్‌లో హై అలర్ట్: రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద తనిఖీలు జోరు!
రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద తనిఖీలు జోరు!

Hyderabad on High Alert After Delhi Blast: ఢిల్లీలో జరిగిన భయంకర పేలుడు ఘటనపై దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, ముంబై తదితర ప్రధాన నగరాల్లో పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్‌లోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో బాంబ్ స్క్వాడ్‌లు, పోలీసు బృందాలు తీవ్ర తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినా తక్షణం 100కి సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సాయంత్రం 6:52 గంటల సమయంలో జరిగిన పేలుడులో 10 మంది మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెడ్ లైట్ వద్ద ఆగిన ఒక కారులోనే పేలుడు జరిగినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా తెలిపారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్, ఎన్‌ఐఏ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
హైదరాబాద్‌లో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర బస్ స్టాండ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. కలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాడ్‌బండ్ ఎక్స్‌రోడ్ వద్ద వాహనాలపై భారీ చెకింగ్ జరిగింది. నాకా బ్యారికేడ్‌లలో రద్దీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ చర్యలతో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నా, భద్రత కోసం అందరూ సహకరించాలని అధికారులు కోరారు.

