Hyderabad-Vijayawada NH-65: హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65: స్మార్ట్ హై సెక్యూరిటీ హైవేగా మారనుంది.. ఏఐ కెమెరాలు, సోలార్ దీపాలతో అధునాతన వ్యవస్థ!
ఏఐ కెమెరాలు, సోలార్ దీపాలతో అధునాతన వ్యవస్థ!

Hyderabad-Vijayawada NH-65: హైదరాబాద్-విజయవాడ మధ్య ఎన్‌హెచ్-65 జాతీయ రహదారి ఇకపై హై సెక్యూరిటీ, స్మార్ట్ హైవేగా మారనుంది. దారి పొడవునా డిజిటల్ నిఘా, అత్యాధునాతన సాంకేతికతలతో రూపొందించే ఈ ప్రాజెక్టుకు రూ.10,391 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. భద్రత, ప్రమాద నివారణ, పర్యావరణ సంరక్షణలతో పాటు వాణిజ్య అవకాశాలను పెంచేలా ఈ రోడ్డు రూపొందుతోంది.
ప్రస్తుతం నాలుగు వరసలతో ఉన్న ఈ 231.32 కిలోమీటర్ల రహదారిని ఆరు వరసలుగా విస్తరిస్తున్నారు. తెలంగాణలో మల్కాపూర్ వద్ద అందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు ఈ పనులు జరుగనున్నాయి. నిర్మాణానికి రూ.6,775 కోట్లు, ఇతర అవసరాలకు రూ.3,616 కోట్లు కేటాయించాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ ప్రాజెక్టుతో రహదారి భద్రతా ప్రమాణాలు మరింత బలపడతాయని నిపుణులు చెబుతున్నారు.
భద్రతా వ్యవస్థలు అత్యాధునాతనంగా..
రహదారి మీద ప్రతి కిలోమీటర్‌కు ఒక్కో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సీసీ కెమెరా అమర్చనున్నారు. మొత్తం 231 కెమెరాలు రెండు వైపులా పనిచేస్తాయి. 360 డిగ్రీల కోణంలో 24 గంటల పాటు నిఘా వేసే ఈ కెమెరాలు పోలీసు, రవాణా శాఖలతో అనుసంధానమవుతాయి. వాహనాల స్పీడ్, రంగు, రూట్‌లు, ప్రమాదాలు అన్నీ ట్రాక్ చేస్తాయి. ప్రమాదం జరిగిన వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు లొకేషన్, కిలోమీటర్ నంబర్‌తో వీడియోలు పంపుతాయి. రహదారిపై రెండు మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
పర్యావరణ, సౌకర్యాలు మెరుగుపడతాయి..
సోలార్ వీధి దీపాలు, రోడ్డు పక్కన సేఫ్టీ బారికేడ్లు, మధ్యలో పచ్చదనానికి మొక్కలు నాటడం వంటి చర్యలు చేపట్టనున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే ప్రత్యేక వ్యవస్థలు, అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో రోడ్డు మరింత సురక్షితంగా మారుతుంది. ఈ రహదారి 50 పారిశ్రామిక పార్కులు, 4 ఆర్థిక కారిడార్లు, 2 టెక్స్‌టైల్ క్లస్టర్లకు అనుసంధానమవుతుంది. దీంతో వాణిజ్యం, వ్యాపారం వేగవంతమవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను స్మార్ట్ హైవేలుగా మార్చే కేంద్ర ప్రణాళికలో భాగంగా తెలంగాణలోని కీలక మార్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రైతులు, ప్రయాణికులకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

