అడ్డంకులు పూర్తిగా తొలగినట్టేనా?

గ్రీన్‌ఫీల్డ్ మార్గం సాధ్యమైనా పాత లైన్‌కే ప్రాధాన్యం

ఎన్‌జీటీ నుంచి ఆమోదం

ఎన్‌హెచ్‌ఏఐ వాదనలు బలహీనంగా ఉన్నాయన్న ఆరోపణలు

Hyderabad–Manneguda Road Expansion: జాతీయ రహదారి-163లో భాగమైన హైదరాబాద్ (అప్పా జంక్షన్) నుంచి మన్నెగూడ వరకు రహదారి విస్తరణ ప్రక్రియ మొదటి నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది. తాజాగా జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) నుంచి ఆమోదం లభించినప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాలను పరిగణనలోకి తీసుకోకుండా మర్రిచెట్లు ఉన్న పాత మార్గానికే పట్టుబట్టడం ఇప్పటికీ చర్చనీయాంశమే. ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తే రోడ్డు భద్రత మరింత మెరుగవుతుందన్న వాదనలు ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుతో భూములు కోల్పోయే భయం...

ఈ రహదారి మొదట ఆర్‌అండ్‌బీ స్టేట్ హైవే-4గా ఉండేది. 2016లో దీన్ని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేశారు. 2018లో ఎన్‌హెచ్ నంబర్ ప్రకటించి, భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. మొత్తం 46 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డును విస్తరించాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత మార్గంలో మలుపులు ఎక్కువగా ఉండటంతో, కొన్ని ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ పద్ధతిలో నేరుగా రోడ్డు నిర్మిస్తే మంచిదని ఆలోచించింది. అయితే, అలా చేస్తే కొత్త భూసేకరణ అవసరం. ఈ ప్రాంతంలో వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు చెందిన ఫాం హౌస్‌లు, భూములు ఉన్నాయి. గ్రీన్‌ఫీల్డ్ మార్గం వల్ల తమ భూములు కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళనతో భూసేకరణ ఎన్నో సంవత్సరాలు ముందుకు సాగలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రముఖుల ఒత్తిడి కారణమా...?

ఏదైనా రోడ్డు విస్తరణ లేదా కొత్త నిర్మాణానికి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేయాలి. అందులో ఎలైన్‌మెంట్‌కు నాలుగు ఆప్షన్లు సూచిస్తారు. అడ్డంకులు లేని ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అయితే, ప్రముఖుల నుంచి ఒత్తిడి ఉండటంతో అధికారులు చివరికి ప్రస్తుత రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించే ఆప్షన్‌కు మొగ్గు చూపారన్న ప్రచారం ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టగా, కొందరు ఎన్‌జీటీని ఆశ్రయించారు. ఈ మార్గంలో 915 మర్రి వృక్షాలు ఉండటంతో, వాటిని తొలగిస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని వాదించారు. 2021లో కేసు నమోదై, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ) చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 2022 మేలో నిర్మాణదారుతో ఒప్పందం జరిగినా, 24 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులు ముందుకు సాగలేదు. 2025 మార్చిలో ఈఐఏ నివేదిక సమగ్రమైనది కాదని ఎన్‌జీటీ తెలిపి, మరింత లోతైన అధ్యయనం సూచించింది.

ఎన్‌జీటీ తీర్పును సవాలు చేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి పనులు స్తబ్దుగా ఉన్నాయి. చివరికి, కొన్ని మర్రిచెట్లను సమీప పొలాలకు రీలొకేట్ చేస్తామని, మిగతావి తొలగించకుండా ఎలైన్‌మెంట్ ప్రకారం ముందుకు సాగుతామని ఎన్‌జీటీకి ఎన్‌హెచ్‌ఏఐ హామీ ఇచ్చింది. దీంతో అక్టోబర్ 31న రోడ్డు పనులను కొనసాగించేందుకు ఎన్‌జీటీ ఆమోదం తెలిపింది.

మర్రిచెట్ల ప్రాంతంలో రోడ్డు సంకుచితం?

అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు కేవలం 26 కిమీ మేర మర్రిచెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ పద్ధతితో ఎలైన్‌మెంట్ మార్చితే పర్యావరణ సమస్యలు తలెత్తేవి కావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ న్యాయపరంగా తగిన దృష్టి పెట్టలేదని, బలమైన వాదనలు చేయలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి 150 మర్రిచెట్లను మాత్రమే తొలగించి, మిగతా 765ను అలాగే ఉంచేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమైంది. ఇలా జరిగితే మర్రిచెట్లు ఉన్న ప్రాంతాల్లో రోడ్డును సంకుచితం చేయాల్సి వస్తుంది. ఇది రోడ్డు విస్తరణ చేసినా పలు చోట్ల ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story