కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెడతానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్న కేటీఆర్‌

హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా మాడిమసై పోతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. నగరంలో నిన్న కురిసిన వర్షానికి అస్తవ్యస్తమైన హైదరాబాద్‌ పరిస్ధితిపై, ఉచిత మంచి నీటి పథకానికి ప్రభుత్వం స్వస్తి చెప్పాలని చూస్తుండటంపై కేటీఆర్‌ తన ఎక్స్‌ ఖాతాలో స్పందించారు. నగరంలో ఓవైపు అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్ధ, మరోవైపు వర్షాలకు దెబ్బతిన్న రహదారులతో ప్రజలు అవస్ధలు పడుతుంటే, ఫ్రీ వాటర్‌ స్కీమ్‌కు కూడా గండికొట్టాలని చూస్తున్న రేవంత్‌ రెడ్డి సర్కార్‌కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు హైదరాబాద్‌ ప్రజలు సిద్దంగా ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావస్తున్నా ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి రేవంత్‌రెడ్డి మహా పాపం మూటగట్టుకున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ అమలు చేసిన పథకాలను ఆపేయాలని చూస్తే మహానగరంలో ఉన్న కోటీ 20 లక్షల మంది ప్రజలు కాంగ్రెస్‌ పార్టీనీ, సీయం రేవంత్‌ రెడ్డిని ఎన్నటికీ క్షమించరన్నారు. రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అని కేటీఆర్‌ విమర్శించారు. ఇప్పటికే హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసి నగరానికి తీరని నష్టం కలిగించారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌లో రెప్పపాటు కాలం కూడా కరెంటు కోతలు లేవని, రాజధాని వాసులకు మళ్ళీ కరెంటు కష్టాలను పరిచయం చేసిన పాపం రేవంత్‌ సర్కారుదే అని కేటీఆర్‌ మండిపడ్డారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story