CM Revanth Reddy: హైడ్రా కార్యాచరణ కొనసాగుతుంది.. కబ్జాకోరులకు ఊరట లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణలో హైడ్రా (HYDRAA) కార్యాచరణను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షిస్తామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ అని అభివర్ణించారు.
కబ్జాలు చేసినవారు బడా బాబులైనా, పేదలైనా ఊరుకోమని సీఎం స్పష్టం చేశారు. “గండిపేట బతుకమ్మ కుంటను ఆక్రమించింది పేదలా? పెద్దలా? ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా?” అని విపక్షాలను ప్రశ్నించారు. చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే హైడ్రా విధి అని తెలిపారు. బతుకమ్మకుంటలో బీఆర్ఎస్ నేత 10 ఎకరాలు కబ్జా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
హైడ్రా కమిషనర్‌గా ఎవరిని నియమించాలనే విచక్షణ ప్రభుత్వానికి ఉందని కుండబద్దలు కొట్టారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌పై 400 పైగా కోర్టు ధిక్కరణ కేసులున్నాయని గుర్తు చేశారు. కబ్జాకోరులు ఫేక్ పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని, డబ్బు ఖర్చు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోతుకుంట భూముల కేసు నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, ఆయనను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ అధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సమంజసం కాదని, అర్హత కలిగిన అధికారిని నియమించాలని సూచించింది. ఈ ఆదేశాలపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు.
హైడ్రా కార్యాచరణపై ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, కబ్జాకోరులకు సహకరించవద్దని మీడియాకు సూచించారు.

