Hydra: గాజుల రామారంలో 100 ఎకరాలకు పైగా కబ్జా.. హైడ్రా కూల్చివేతలు
హైడ్రా కూల్చివేతలు

Hydra: గాజుల రామారంలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రాంతంలో 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. 60 నుంచి 70 గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లను రూ.10 లక్షల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగి, సర్వే నంబర్ 397లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ ఆక్రమణల ద్వారా రూ.4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో 100 ఎకరాలు కబ్జా కాగా, కూల్చివేతల అనంతరం మిగిలిన 300 ఎకరాల భూమికి రూ.15 వేల కోట్ల విలువ ఉన్నట్లు అంచనా. ఈ భూములను సంరక్షించేందుకు హైడ్రా కంచె వేయనుంది. స్థానికులు మాత్రం కూల్చివేతలపై ఆందోళన వ్యక్తం చేశారు. తాము డబ్బులు చెల్లించి ఇళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు. అక్రమంగా ఇళ్లు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, జేసీబీ వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు.
గాజుల రామారం, హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు 10 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో దశాబ్దాల క్రితం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ, హౌసింగ్ బోర్డు వంటి విభాగాలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే, ఈ విభాగాలు కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో, గత మూడు నాలుగేళ్లుగా కొందరు అక్రమార్కులు ఈ భూములను కబ్జా చేశారు.
ఈ ప్రాంతంలో ఒక ఎకరం భూమి మార్కెట్ విలువ రూ.40-50 కోట్లుగా ఉంది. మూడున్నరేళ్లలో 103 ఎకరాల భూమిని ఆక్రమించారు, దీని విలువ దాదాపు రూ.4,500 కోట్లు. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, చింతల్ పరిసరాల్లో సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి విక్రయిస్తున్నారు. రెవెన్యూ, విద్యుత్ అధికారుల సహకారంతో కొందరు కబ్జాదారులు విద్యుత్ మీటర్లు, నల్లా కనెక్షన్లు సమకూర్చుకుంటున్నారు. దీంతో సామాన్యులు అప్పులు చేసి ఈ ఇళ్లను కొంటున్నారు. అక్రమంగా భూములు అమ్మి, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకుని, ఖరీదైన కార్లలో తిరుగుతున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
