Hydra: హైడ్రా: ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు.. కొండాపూర్‌లో 36 ఎకరాల ప్రాంతంలో కూల్చివేత చర్యలు
కొండాపూర్‌లో 36 ఎకరాల ప్రాంతంలో కూల్చివేత చర్యలు

Hydra: హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు కూల్చివేతలను నిర్వహించారు. ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని భిక్షపతి నగర్‌లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. భారీ పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ చర్యలు జరిగాయి. కూల్చివేత ప్రాంతానికి ఎవరినీ అనుమతించకుండా, రెండు కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి స్థానికులను అడ్డుకున్నారు.
ఈ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేసుకున్నారు. హైకోర్టు తీర్పు ఆధారంగా హైడ్రా ఈ ఆక్రమణలను తొలగించే పనిని చేపట్టింది. తాత్కాలిక షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని ఖాళీ చేయించి, చుట్టూ కంచెలు వేసి ప్రభుత్వ భూమిగా సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 59కు చెందిన ఈ భూముల విలువ సుమారు రూ.3,600 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. మరోవైపు, 60 సంవత్సరాలుగా ఈ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని రైతులు వాదిస్తున్నారు.
