Hyderabad: మూసీ నది పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక కార్యక్రమాలు.. భారీ వర్షాల నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు
భారీ వర్షాల నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు

Hyderabad: తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో వరదలు భారీగా ప్రవహిస్తున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న రెండు జలాశయాలు (హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్) గేట్లను తెరిచి అధికారులు నీటిని విడుదల చేశారు. నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)కు వరద నీరు పోటెత్తడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
మూసీ నది పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రిటర్నింగ్ వాల్ కూలిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద నీరు పోటెత్తిందని వివరించారు. ఎంజీబీఎస్‌లో డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఎంజీబీఎస్‌లో వరద పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని పేర్కొన్నారు. బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వరదలు తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.
