Minister Konda Surekha: కమిటీకి వివరణ ఇచ్చా.. సీఎం రేవంత్ వచ్చాకే మాట్లాడతా: మంత్రి కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ

Minister Konda Surekha: కాంగ్రెస్ షోకాజ్ నోటీసుల అంశంపై తాను చెప్పాల్సినదంతా క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే చెప్పానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రస్తుతం మీడియాతో మాట్లాడనని, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే మాట్లాడతానని తెలిపారు.
“నేను చెప్పాల్సింది నిన్ననే క్రమశిక్షణ కమిటీకి చెప్పా. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన విషయాలేమీ లేవు. సీఎం రేవంత్ వచ్చాక మాట్లాడతాను” అని సురేఖ అన్నారు.
ఇటీవల వరంగల్ జిల్లా గీసుకొండలో మంత్రి కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు స్పందిస్తూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌కు వివరణ పంపారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, ఈ విషయంలో తనను బాధ్యురాలిని చేయవద్దని అందులో కోరారు.
మరోవైపు సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముఖ్యమంత్రిపై మంత్రి కుమార్తె చేసిన విమర్శలు, ఆరోపణలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణా రాహిత్యంగా భావించి నోటీసులివ్వడంతో పరిమితం కాకుండా తదుపరి చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

