తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈగడ్డపై మాదకద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని హెచ్చరించామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. డ్రగ్స్‌ వ్యతిరేక దినం సందర్భంగా శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉందని, నిజాంలకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల పుట్టిన గడ్డ ఇదని అన్నారు. అటువంటి గడ్డపై ఉద్యమ స్పూర్తితో ముందుకు వెళ్ళాల్సిన యువత డ్రగ్స్‌ మహమ్మారికి బలవడం సరికాదన్నారు. ఉద్యమాల గడ్డ తెలంగాణ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్‌ మహమ్మరికి బలవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ కూర్చోదని సీయం స్పష్టం చేశారు. ప్రపంచంలో 68 శాతం యువత ఉన్న ఏకైక దేశం భారతదేశమని, శత్రు దేశాలు మనల్ని నిర్వీర్యం చేసేందుకు వివిధమార్గాలను ఎంచుకుంటున్నాయని… అందులో డ్రగ్స్‌ ఒకటని సీయం పేర్కొన్నారు. పంజాబ్‌ రాష్ట్రంలో డ్రగ్స్‌ కి బానిస అయిపోయి యువత నిర్వీర్యం అయిపోయిందని సీయం అన్నారు. అలా తెలంగాణలో కాకుండా చూసే బాధ్యత మనందరిపై ఉందని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక స్పోర్ట్స్‌ పాలసీ తీసుకొచ్చామని, యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని సీయం తెలిపారు. నల్లమల నుంచి వచ్చిన నేను జడ్పీటీసీ నుంచి సీయం స్ధాయికి ఎదిగాను, నాలాగే నల్లమల నుంచి వచ్చిన విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరో స్ధాయికి ఎదిగారు, కష్టం, కమిట్‌మెంట్‌ లేకుండా ఈ స్ధాయికి ఎవరూ రాణించలేరని సీయం చెప్పారు. అందుకే మాదకద్రవ్యాల నియంత్రణకు కలసికట్టుగా ముందుకు రండి, నోడ్రగ్స్‌ కు మీరే వారధులుగా మారండని సీయం పిలుపునిచ్చారు.

పాఠశాలలు, కళాశాలల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలని, విద్యార్థుల వ్యవహార శైలిని గమనించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీ సంస్థల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా పర్యవేక్షించాల్సినబాధ్యత యాజమాన్యాలదే అన్నారు. మనందరం అప్రమత్తంగా ఉంటేనే మాదకద్రవ్యాలను నియంత్రించగలమన్నారు. ఉద్యమాల గడ్డ తెలంగాణ గంజాయి, డ్రగ్స్ కు వేదిక అవడానికి ఎట్టి పరిస్ధితుల్లో అంగీకరించేది లేదన్నారు. TGNAB ఇకనుంచి EAGLE (ELITE ACTION GROUP FOR DRUG LAW ENFORCEMENT) గా మారుస్తున్నామని, ఈ EAGLE తెలంగాణలో ఎక్కడ గంజాయి పండించినా పసిగడుతుందని, అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే నియంత్రిస్తుందని సీయం రేవంత్‌ రెడ్డి తెలిపారు. డ్రగ్స్‌ జోలికి వెళ్లకుండా చదువు, స్పోర్ట్స్ లలో రాణించి హీరోలుగా నిలవమని సీయం రేవంత్ రెడ్డి తెలంగాణ యువతకు పిలుపునిచ్చారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story