విద్యాశాఖ మంత్రినైతే ఆదేశాలు జారీ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Minister Komatireddy Venkat Reddy: విద్యను వ్యాపారంగా మార్చి పేద, మధ్యతరగతి తల్లిదండ్రులను దోచుకుంటున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను విద్యాశాఖ మంత్రి అయితే రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ స్కూళ్లను మూసివేసి, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేలా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో తన దివంగత కుమారుడు ప్రతీక్‌రెడ్డి పేరిట ఏర్పాటైన ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో నిర్మించిన కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని మంగళవారం ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు పేదవారికి కేటాయించాల్సి ఉండగా, కొన్ని కార్పొరేట్ సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని ఆయన ఆరోపించారు.

ప్రతి అడ్మిషన్ సీజన్‌లో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తన దగ్గరకు వచ్చి ఫీజులు తగ్గించాలని విన్నపాలు చేస్తుంటారని, ఎల్‌కేజీ స్థాయి నుంచే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. "నేనే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ విద్యాసంస్థలను మూసివేసి, అందరూ ప్రభుత్వ బడుల్లో చదివేలా ఆదేశాలు జారీ చేస్తా" అని ఆయన ప్రకటించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కార్పొరేట్ విద్యా సంస్థల ప్రాధాన్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశారని మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడి పేరిట నిర్మించిన ఈ పాఠశాలను కార్పొరేట్ హంగులతో అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.

అధునాతన సౌకర్యాలతో నిర్మాణం

2,500 చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఈ నాలుగు అంతస్తుల భవనంలో 40 విశాలమైన ఏసీ తరగతి గదులు, ఇండోర్ గేమ్స్ జోన్, కంప్యూటర్ ల్యాబ్స్, యోగా సెంటర్, లిఫ్టులు, గ్రంథాలయం, స్టెమ్ విద్య సౌకర్యాలు, స్మార్ట్ లెర్నింగ్ టూల్స్, డిజిటల్ తెరలతో బోధన వంటి అన్ని అధునాతన వసతులు కల్పించారు. వాల్డార్ఫ్ బోధన పద్ధతి (కృత్యాధార) ఆధారంగా విద్యార్థులకు ఆలోచన, భావన, కార్యాచరణ ద్వారా అనుభవాత్మక విద్య అందిస్తామని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, కాంగ్రెస్ నాయకులు బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story