Harish Rao: బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, ఫార్మా సిటీని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు.

అమెరికా పర్యటనలో ఉన్న హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా సిటీకి మాత్రమే అనుమతి ఇచ్చిందని, ఫ్యూచర్ సిటీకి కాదని గుర్తు చేశారు. డీవియేషన్ ఉంటే రైతుల భూములను వెనక్కి ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు కోర్టులో ఫార్మా సిటీని కొనసాగిస్తామని చెబుతూ, మరోవైపు ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు.

75 శాతం ఫార్మా, 25 శాతం మిగతా సౌకర్యాలు

ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా విద్య, హౌసింగ్ వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం భావించిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 75 శాతం భూమిని ఇతర వ్యాపారాలకు, 25 శాతం మాత్రమే ఫార్మాకు కేటాయించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇలాంటి మార్పులు చట్టపరంగా చెల్లవన్నారు.

ఫార్మా సిటీ అమలు చేస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలంలో ఒక్క ఫార్మా కంపెనీ కూడా రాష్ట్రం నుంచి బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ గత రెండున్నరేళ్లలో రేవంత్ సర్కారు ఏమీ చేయలేదని ఆక్షేపించారు.

బీఆర్‌ఎస్ వస్తే ఫార్మా సిటీనే వస్తుంది

“ఇది నా మాట కాదు.. పార్లమెంట్ చట్టం. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది” అని హరీశ్ రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీని పూర్తిగా రద్దు చేసి, ఫార్మా సిటీని పునరుద్ధరించి అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story