హాలీవుడ్ వచ్చినట్లే: సీఎం రేవంత్ రెడ్డి

A. Revanth Reddy: ప్రపంచ ప్రసిద్ధ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన గ్లోబల్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హబ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైటెక్ సిటీలోని ఐలైన్ స్టూడియోస్ (Eyeline Studios) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం (మార్చి 12, 2026) ఉద్ఘాటన చేశారు. ఐటీ మరియు పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో, నటుడు-నిర్మాత రానా దగ్గుబాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే హాలీవుడ్ నగరానికి వచ్చినట్లే అని అన్నారు. బాల్యం నుంచి తనకు సినిమాలు అంటే ఇష్టమని, ఈ సందర్భాన్ని చాలా సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అన్ని రకాల అవకాశాలను కల్పిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం నెట్‌ఫ్లిక్స్‌కు అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌ను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభం తెలంగాణలోని సృజనాత్మక, సాంకేతిక నైపుణ్యాలకు కొత్త ఊపిరి పోస్తుందని అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలన్నీ హైదరాబాద్‌లో స్థిరపడాలని కోరుకుంటున్నామని, నెట్‌ఫ్లిక్స్‌కు భారత్ ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమం హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టూడియో గ్లోబల్ ఫిల్మ్, స్ట్రీమింగ్ ప్రొడక్షన్‌లకు మద్దతు ఇవ్వనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story