Kishan Reddy Slams CM Revanth Reddy Over Procurement Issues: కేంద్రమే డబ్బులు ఇస్తుంటే ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది ఏమిటి? కిషన్ రెడ్డి సీఎం రేవంత్‌పై తీవ్ర విమర్శలు
కిషన్ రెడ్డి సీఎం రేవంత్‌పై తీవ్ర విమర్శలు

Kishan Reddy Slams CM Revanth Reddy Over Procurement Issues: కేంద్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచినా, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉండిపోతోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.
ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి మరిన్ని విషయాలపై తీవ్ర స్పందన తెలిపారు.
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం:
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, రైతులు అనేక ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. యూపీఏ కాలంలో ధాన్యం క్వింటాల్‌కు రూ.1,300 గిట్టుబాటు ధర ఉండగా, మోదీ ప్రభుత్వం దాన్ని రూ.2,360కు పెంచిందని గుర్తు చేశారు.
కేంద్రమే నిధులు ఇస్తుంటే ఆలస్యం ఎందుకు?
ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, రాష్ట్రంపై ఒక్క రూపాయి కూడా భారం పడదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. “కేంద్రమే మొత్తం భరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు ఎందుకు ఆలస్యం చేస్తోంది? దీనికి రేవంత్‌రెడ్డి సర్కారు సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
ధాన్యంపై బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతుల ఇబ్బందులను తీర్చాలని, మంత్రులంతా జిల్లాల వారీగా వెళ్లి కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని సూచించారు.
‘సర్’పై రేవంత్ వ్యాఖ్యలు తప్పు:
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో ఒక్కొక్కరికి రెండు-మూడు చోట్ల ఓట్లు ఉంటే గుర్తించి తొలగిస్తారని, ముఖ్యంగా రోహింగ్యాల ఓట్లు కచ్చితంగా తొలగించబడతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియను రాష్ట్ర అధికారులే నిర్వహిస్తారని, కేంద్రం కుట్రలు చేయడం లేదని స్పష్టం చేశారు. ‘సర్’పై రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తప్పుడవని మండిపడ్డారు.
పెట్రోల్ ధరలు, బండి భగీరథ్ కేసు:
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును అప్రజాస్వామికమని సీఎం ఆరోపించడం సరికాదని, ఇది కేంద్రం చేతిలో లేని అంశమని కిషన్‌రెడ్డి వివరించారు. గతంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందని, రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని కోరిందని గుర్తు చేశారు. తెలంగాణలోనే దేశంలో అత్యధిక వ్యాట్ విధిస్తున్నారని ఎద్దేవా చేశారు.
బండి భగీరథ్ కేసులో కేంద్రానికి ఎలాంటి ప్రమేయం లేదని, ఇది పూర్తిగా రాష్ట్ర పోలీసుల విషయమని స్పష్టం చేశారు.

