VANA MAHOTSAVAM : ప్రకృతిని మనం కాపాడితే మనలని ప్రకృతి కాపాడుతుంది
వనమహోత్సవం–2025ని ప్రారంభించిన సీయం రేవంత్ రెడ్డి

వనమే మనం… మనమే వనం అని పెద్దలు చెప్పిన మాట ప్రకారం ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక రుద్రాక్ష మొక్క నాటడం ద్వారా వనమహోత్సవం-2025 కార్యక్రమాన్ని సీయం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటమని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కలు నాటాలని సీయం పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిలో కనీసం రెండు మొక్కలు నాటమని ముఖ్యమంత్రి సూచించారు. మీ పిల్లల్లాగే వాటిని కూడా సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్ర మంతా పచ్చదనంతో నిండిపోతుందన్నారు. మన ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించే విషయంలో ముందు ఉంటుదని సీయం వెల్లడించారు. సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను ఆడబిడ్డలకు అప్పగించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామని సీయం పేర్కొన్నారు.
హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్ధలు ఉండే చోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్‌యం పెట్టుకున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరమని సీయం పిలుపునిచ్చారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ. 21వేల కోట్లు రుణాలు అందించామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటాన్నామన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతోందని, వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీయం రేవంత్ రెడ్డి మహిళామణులకు హామీ ఇచ్చారు. అంతకు ముందు రాజేంద్రనగర్ లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసి వన మహోత్సవ ఫొటో ఎగ్జిబిషన్ ను సీయం తిలకించారు.
