విద్యార్థులు చనిపోయినా సీఎం రేవంత్ సమీక్ష చేయరా?

K. Kavitha: తెలంగాణలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదించేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. నాలుగు వేల పాఠశాలలు మాత్రమే నడుపుతానని అంటున్న రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే మరింత ఎక్కువ అని ఘాటు విమర్శలు చేశారు. ఆడపిల్లలు, పేదల చదువులకు దూరం చేసేందుకే ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నారని ఆరోపించారు.

విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయారని, ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదని ప్రకటించిన మరుసటి రోజే అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందని కవిత వ్యాఖ్యానించారు. జూనియర్ కళాశాలలు ప్రారంభమై వారం రోజులు అయినా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్లు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు.

డిగ్రీ అడ్మిషన్లు గందరగోళంగా మారాయని, ఉన్నత విద్యా మండలి కొన్ని కోర్సులు సిఫార్సు చేస్తే కమిషనరేట్ మరికొన్ని రిఫర్ చేసిందని, ఏ కోర్సుకూ యూనివర్సిటీలు అప్రూవల్ ఇవ్వకుండానే డోస్త్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు. గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయినా సీఎం రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష చేయడం లేదని, రూ.11 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ఉండటం బాధాకరమని విమర్శించారు.

జీవో 7ను వెంటనే రద్దు చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తక్షణం అమల్లోకి తెచ్చి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కవిత డిమాండ్ చేశారు. విద్యా రంగంలో గందరగోళం సృష్టిస్తున్న ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story