CM Revanth Reddy: నగరంలోని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. క్యూర్‌ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఓఆర్‌ఆర్‌ లోపల నిరుపయోగంగా ఉన్న వివిధ స్థలాలను గుర్తించి, ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖల స్థలాలను తీసుకుని ఆయా శాఖలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇళ్లను జనావాసాలకు దూరంగా నిర్మిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశముందని, అందువల్ల ప్రజల పని ప్రదేశాలకు దగ్గరగా ఇళ్లు నిర్మించాలని సీఎం స్పష్టం చేశారు.

ఒక్కో ఇందిరమ్మ ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం సుమారు రూ.11 లక్షలు ఉండగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. భూమి ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.

తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు నిర్మించి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట నియోజకవర్గాల్లో ఈ ఇళ్ల నిర్మాణం జరగనుంది.

ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు సొంత నివాసాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story