పట్టణ లబ్ధిదారులకు ప్రభుత్వ ఊరట!

Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 400 చదరపు అడుగులు (44.4 చదరపు గజాలు)లోపు స్థలం ఉన్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ ఇచ్చింది. వీరు గ్రౌండ్‌ ఫ్లోర్‌ పై మొదటి అంతస్తు (జీ+1) విధానంలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని ఇరుకు ప్లాట్ల హోల్డర్లను దృష్టిలో ఉంచుకొని హౌసింగ్‌ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం హౌసింగ్‌ కార్యదర్శి గౌతమ్ ఈ సందర్భంగా సంబంధిత జీవో (GO) విడుదల చేశారు.

ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇళ్లు నిర్మించుకోవాలనే నిబంధన ఉంది. ఆ పరిధిలో నిర్మాణం పూర్తయినప్పుడే ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. మొదటి విడతలో మొత్తం 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం, 3.31 లక్షల మందికి అనుమతులు జారీ చేసింది. పునాది దశలో 96 వేల ఇళ్లు, గోడలు పూర్తయిన 36 వేలు, శ్లాబ్‌ దశలో 26 వేలు ఉన్నాయి. మరో 371 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. పట్టణ ప్రాంతాల్లోని చాలా మంది లబ్ధిదారులకు 400 చ.అ.లోపు స్థలాలే ఉన్నట్లు హౌసింగ్‌ శాఖకు తెలిసింది. వీరిని కూడా పథకంలో చేర్చాలనే విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో, మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది.

400 చ.అ.లోపు స్థలంలో కార్పెట్‌ ఏరియా 323 చ.అ.లకు తక్కువ కాకుండా జీ+1 విధానంలో ఇంటిని నిర్మించాలి.

ఈ ఇంటి నిర్మాణంలో అతిపెద్ద గది 96 చ.అ.లకు, రెండో పెద్ద గది 70 చ.అ.లకు మించకూడదు. గది ఎత్తు కనీసం 2.6 మీటర్లు ఉండాలి. వంటగది 35.5 చ.అ.లు ఉండాలి. తప్పనిసరిగా మరుగుదొడ్డి, బాత్రూం సౌకర్యాలు ఉండాలి.

జీ+1 విధానంలో ఇంటిని ఆర్‌సీసీ ఫ్రేమ్‌లో నిర్మించాలి. ఈ డిజైన్‌కు హౌసింగ్‌ శాఖ డిప్యూటీ ఈఈ నుంచి అనుమతి పొందాలి.

గ్రౌండ్‌ ఫ్లోర్‌కు రూ.1 లక్ష, రూఫ్‌ లెవల్‌కు రూ.1 లక్ష, మొదటి అంతస్తుకు రూ.2 లక్షలు, మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.1 లక్ష చొప్పున ఇందిరమ్మ ఇంటికి మొత్తం రూ.5 లక్షలు అందజేస్తారు.

పట్టణాల్లో ఇరుకు ప్లాట్ల సమస్యకు స్పూ�ట్‌: మంత్రి పొంగులేటి

పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసించే లబ్ధిదారులకు పక్కా ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించేందుకు నిబంధనల్లో సడలింపు తీసుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 323 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి, ‘‘పట్టణాల్లో చాలా మందికి 60 చదరపు గజాల స్థలం కూడా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో తక్కువ స్థలంలోనే జీ+1 విధానంలో ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇంటిని అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని స్పష్టం చేశారు.

Updated On 23 Oct 2025 2:22 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story