ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

Chief Minister Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లో ఆమె విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పలువురు మహిళల చేతుల్లో చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఉచితంగా ఇందిరమ్మ చీరలు అందజేయనున్నట్టు సీఎం ప్రకటించారు. మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మంది మహిళలకు నేటి నుంచి డిసెంబరు 9 (తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం) వరకు చీరలు పంపిణీ చేయనున్నారు. రెండో దశలో పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) వరకు అందజేయనుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మండల కేంద్రాల్లో ఘనంగా చీరలు పంపిణీ చేయాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తాం. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. చీరలు అందజేస్తూనే మహిళల వివరాలు సేకరించండి. ఇది భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగపడుతుంది’’ అని సూచించారు.

చీరల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు అధికారులు తెలిపారు. సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేసిన నాణ్యమైన చీరలే పంపిణీకి ఎంపికయినట్టు సమాచారం. మహిళా సాధికారతకు ఇది మరో ముందడుగని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story