Bhatti Vikramarka: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం దళితులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఖర్గే పాల్గొన్న సభ ప్రాంగణాన్ని భాజపా కార్యకర్తలు శుద్ధి చేసిన ఘటనకు నిరసనగా మంగళవారం దిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో దళిత-ఆదివాసీ ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభలో భట్టితో పాటు రాష్ట్ర మంత్రులు సీతక్క, వివేక్, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

భట్టి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల శ్రేయస్సు, ఆత్మగౌరవం కోసం ఎల్లప్పుడూ ముందుంటుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కానీ భాజపా ప్రభుత్వం సమాన హక్కుల వ్యవస్థను అమలు చేయడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే దేశద్రోహ చర్యగా పరిగణిస్తున్నారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదు. మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఖర్గే అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. అలాంటి నేతను అవమానించడం బాధాకరం” అన్నారు.

ఆయన మరింతగా మాట్లాడుతూ, “ఖర్గేను అవమానించిన ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ నిరసన చేపడితే, ఆయనపైనే కేసు పెట్టారు. ప్రశ్నించే గొంతులను లేకుండా చేస్తున్నారు. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలను రెండో తరగతి పౌరులుగా చూసే పరిస్థితిని అంగీకరించకూడదు. రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందుకోసం ప్రతి రాష్ట్రానికి వెళ్లి ప్రజలను చైతన్యపరుద్దాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తీసుకొచ్చిన సామాజిక న్యాయ చట్టాలను కాపాడుకుందాం” అని పిలుపునిచ్చారు.

Next Story