Minister Uttam Kumar Reddy: హైదరాబాద్‌లో డిసెంబరు 7 నుంచి నిర్వహించనున్న గ్లోబల్ సమిట్‌లో భాగంగా రెండు రోజులపాటు అంతర్జాతీయ వాతావరణ సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సచివాలయంలో సదస్సు ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సన్నద్ధత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం, హరిత పెట్టుబడులు వంటి అంశాలు సదస్సులో ప్రధానంగా చర్చకు వస్తాయని మంత్రి తెలిపారు. దేశ, విదేశాల నిపుణులతో పాటు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనే హాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రులు, నార్వే, డెన్మార్క్, స్వీడన్ తదితర దేశాల రాయబారులను ఆహ్వానించే ప్రతిపాదన కూడా ఉందని పేర్కొన్నారు.

కరవు ప్రభావం ఉండే వర్గాలను ఆదుకోవడంపై ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రత, వ్యవసాయం, ప్రజల జీవనోపాధి అంశాలపై చర్చించాలని సూచించారు. వేసవిలో పశుగ్రాసం, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, తాగునీరు, విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశాన్ని అంచనా వేసి సన్నాహాలు చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి నెలకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పినందున దానికి అనుగుణంగా వ్యూహాలు రూపొందించాలన్నారు.

రాష్ట్రంలో చేపట్టిన భూగర్భ జలాల పునరుద్ధరణ, సూక్ష్మసేద్యం, నేల సంరక్షణ నమూనాలను సదస్సులో ప్రదర్శించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి వినయ్‌కుమార్, ట్రాన్స్‌కో ఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story