Deputy CM Bhatti: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులకున్న అపార అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా నిలపాలని సూచించారు.

గురువారం ప్రజాభవన్‌లోని ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ వార్ రూమ్’లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె.రామకృష్ణారావు, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సదస్సు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పురోగతిని మంత్రులందరికీ తెలియజేయాలని ఆదేశించారు.

“2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్య సాధనకు ఈ సదస్సు కీలక వేదికగా నిలవాలి. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సమిట్ ఏర్పాట్లు ఉండాలి. ఇప్పటికే పారిశ్రామిక రంగ ప్రముఖులతో సహా 1,700 మందికి పైగా ఆహ్వానితులు తమ హాజరును ఖరారు చేసుకున్నారు. మరో 1,300 మంది అతిథులు హాజరుకావచ్చు. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు సదస్సు విజయవంతానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి” అని భట్టి స్పష్టం చేశారు.

సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక కన్వెన్షన్ కేంద్రాల్లో ఒకటైన ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌ను మించే స్థాయిలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ప్రధాన వేదికను, ప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా అదనపు హాళ్లు, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. సదస్సులో తెలంగాణ స్క్వేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వైభవం, సంప్రదాయ కళలు, హస్తకళలు, ప్రత్యేక వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేలా తెలంగాణ స్క్వేర్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు.

ప్రపంచ పెట్టుబడులకు వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలపాలనే లక్ష్యంతో సమిట్‌ను నిర్వహిస్తున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. ఈ నెలాఖరులోగా సమిట్ నిర్వహణ పనుల ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. గురువారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమీక్షా సమావేశం నిర్వహించింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వివిధ కమిటీలకు నేతృత్వం వహిస్తున్న అధికారులు తమ పరిధిలో చేపడుతున్న ఏర్పాట్లపై సమగ్రంగా వివరించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో పాల్గొనేందుకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు ఇప్పటికే 1,800 ఆహ్వానాలు పంపించారు. అన్ని కమిటీల మధ్య సమన్వయం పటిష్ఠంగా ఉండాలి. ప్రతి అంశంలోనూ ఉన్నత ప్రమాణాలు పాటించాలి. తెలంగాణ పెట్టుబడుల అవకాశాలు, ప్రపంచస్థాయి అభివృద్ధి లక్ష్యాలను ప్రతిబింబించేలా సమిట్‌ను విజయవంతంగా నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది.

Next Story