Minister Komatireddy Venkat Reddy: ఐఆర్‌సీ సదస్సు.. తెలంగాణ పెట్టుబడులకు కొత్త వేదిక: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Minister Komatireddy Venkat Reddy: ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరగనున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సదస్సును తెలంగాణలో పెట్టుబడులకు వేదికగా మలచాలని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం సచివాలయంలో ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఏర్పాట్ల సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ‘‘సదస్సును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇంజినీరింగ్ నిపుణులు హాజరవుతారు. ఈ సదస్సును రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలకు వేదికగా మార్చుకోవాలి’’ అని సూచించారు.
హైటెక్స్ ప్రాంగణంలో 400 ఎగ్జిబిషన్ స్టాళ్లతోపాటు ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ను ఏర్పాటు చేయాలని, అతిథులకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిసెంబరులో ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు ఈ ఐఆర్‌సీ సదస్సు ప్రీ-సమిట్‌గా నిలవాలని కూడా సూచించారు.
సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, అదనపు కార్యదర్శి గంగాధర్, మోర్త్ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి శివశంకర్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
బాధ్యతలు కేటాయింపు
ఐఆర్‌సీ సదస్సు కోసం ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్లకు బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆహారం, రిజిస్ట్రేషన్‌కు వసంత్‌నాయక్, రవాణాకు బి.వెంకటేశ్వరరావు, బస ఏర్పాట్లకు ధర్మారెడ్డి, ఆర్థిక/రెవెన్యూ విభాగానికి రాజేందర్, సాంకేతిక విభాగానికి రాజేశ్వర్‌రెడ్డి, ఎగ్జిబిషన్‌కు అహ్మద్ అబ్దుల్ అలీ, ప్రచారం, సావనీర్‌కు వేణు, సాంస్కృతిక కార్యక్రమాలకు మాధవి, వైద్య ఏర్పాట్లకు లింగారెడ్డి, వెబ్‌సైట్‌కు సామ్యూల్, పోస్టు సెషన్ పర్యటనలకు రాంబాబు, వేదిక ఏర్పాట్లకు శ్రీనివాస్‌లను నియమించారు.

