Uttam Kumar Reddy: కేంద్ర ప్రభుత్వం ధాన్యం విషయంలో కేవలం మద్దతు ధర ప్రకటించడానికే పరిమితమవుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నా, ఆ ధాన్యాన్ని కేంద్రం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో భాజపా నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో ఏడాదికి రెండు సీజన్లలో కలిపి రూ.75 వేల కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తి అవుతోందని, దీనిలో రూ.45 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని స్పష్టం చేశారు.

ఈ మేరకు రబీ ధాన్యం సేకరణపై సివిల్‌ సప్లయిస్‌ భవన్‌లో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి

ప్రస్తుత రబీ సీజన్‌లో ఇప్పటికే 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.8,749 కోట్లు రైతులకు చెల్లించినట్లు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మిగిలిన ధాన్యంతో కలిపి మొత్తం 75 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. కేంద్రం మాత్రం 52 లక్షల టన్నులకు మాత్రమే అనుమతి ఇచ్చిందని విమర్శించారు.

రానున్న 7-10 రోజుల్లో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల్లో ఉన్న 8.5 లక్షల టన్నుల ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన మిల్లులకు తరలించాలని సూచించారు. వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలించాలన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్‌

ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్‌ సూచించారు. సరిపడా హమాలీలను నియమించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లింపులు నెలల తరబడి ఆలస్యమవుతే, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే చెల్లింపులు చేస్తోందని వివరించారు. వరి పంట కోసిన తర్వాత వ్యవసాయ వ్యర్థాలను కాల్చకుండా నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

లారీల కొరత, మిల్లర్ల సమస్యలు

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో లారీల కొరత ఉందని, మిల్లర్లు తాలు, తరుగు పేరుతో 5 శాతం కటింగ్‌ చేస్తున్నారని తెలిపారు. లారీలు అన్‌లోడ్‌ అవ్వడానికి 4-7 రోజులు పడుతున్నాయన్నారు. కాంటా వేయగానే కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం లెక్కలు నమోదు చేయాలని, రసీదు ఇవ్వకపోతే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందిస్తూ రైతులకు నష్టం కలిగించే మిల్లర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇసుక, సిమెంటు లారీలను కూడా ఉపయోగించి ధాన్యం తరలించాలన్నారు.

సీఎస్‌ రామకృష్ణారావు మాట్లాడుతూ అంచనాల కంటే ఎక్కువ ధాన్యం వస్తోందని, సమస్యలున్న జిల్లాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పది రోజుల్లో సేకరణ పూర్తి చేసి చివర్లో చెడ్డపేరు రాకుండా చూడాలని సూచించారు.

తప్పుడు ప్రచారాలను ఖండించాలి

ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, అధికారులు దీనికి సముచిత స్పందన ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story