Yennam Srinivas Reddy: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు అదనపు నీటిని తరలిస్తుంటే బీఆర్‌ఎస్‌ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. కేసీఆర్‌ తెలంగాణకు శాశ్వత నష్టం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం సీఎల్‌పీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ఆయన.. కేసీఆర్‌ ఢిల్లీలో అధికారం సాధించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రస్తావించారు. కేసీఆర్‌ రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని చెప్పిన విషయాన్ని బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్వర్‌ రెడ్డి మర్చిపోయినట్లు ఉన్నారని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, జగదీశ్వర్‌ రెడ్డి రోజుకో కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా నదిలో 500 టీఎంసీల నీటి వాటా కోసం కాంగ్రెస్‌ పోరాడుతోందని పేర్కొన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు బేసిన్‌లు లేవని చెప్పిన మాటలు నిజం కాదా అని ప్రశ్నించారు.

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాటల్లో.. గతంలో జగన్‌ ప్రభుత్వం ఏపీకి అదనపు నీటిని అనుమతించినప్పుడు బీఆర్‌ఎస్‌ నాయకులు మౌనం వహించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నీటి ప్రయోజనాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story