jaipal Reddy : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర జైపాల్ రెడ్డిదే
జైపాల్ రెడ్డి పోరాటం- వ్యక్తిత్వం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి

- హైదరాబాద్ కు మెట్రో జైపాల్ రెడ్డి వల్లే సాధ్యమైంది
- రాజకీయ జీవితం నేటి తరం నేతలకు ఆదర్శం..స్పూర్తి దాయకం
- జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వని కోరుతున్నాను
తెలంగాణలోని ఒక మారుమూల పల్లె నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన భారత రాజకీయ శిఖరం, బెస్ట్ పార్లమెంటిరియన్ మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. సోమవారం జైపాల్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా పివీనరసింహారావు మార్గ్ లోని స్పూర్తి స్ధల్ లో ఆయన స్మారకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1969లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జైపాల్‌రెడ్డి అక్కడి నుంచే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని తర్వాత మహబూబ్ నగర్, మిర్యాలగూడ, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల నుంచి ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారని చెప్పారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా,రాజ్య సభలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేసిన అపార రాజకీయ అనుభవం కలిగిన నేత జైపాల్ రెడ్డి అని కోమటిరెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర జైపాల్ రెడ్డిదే అని హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి మెట్రో జైపాల్ రెడ్డి వల్లే సాధ్యమైందని ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వని కోరారు. జైపాల్ రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టామన్నారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి పోరాటం- వ్యక్తిత్వం అనే పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎంఎంపల్లంరాజుతో కలసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు.
