Minister Ponguleti: రెవెన్యూ–అటవీ భూ సరిహద్దు వివాదాలకు చెక్.. సంయుక్త సర్వేతో శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి

Minister Ponguleti: రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాలకు సంయుక్త సర్వే ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం (నవంబర్ 2) సచివాలయంలో రెవెన్యూ, అటవీ, భూమి కొలతలు-భూ దస్త్రాల నిర్వహణ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సరిహద్దు వివాదాల వల్ల సామాన్యులు, రైతులు నష్టపోకుండా రెండు శాఖలు సమన్వయంతో సంయుక్త సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
శాస్త్రీయ పద్ధతుల్లో సర్వే చేపట్టాలి
రాష్ట్రంలో సమస్యలున్న ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించి స్పష్టమైన సరిహద్దులు గుర్తించాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా అటవీ భూములు ఉన్నాయని, దశాబ్దాలుగా రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పట్టా భూములు, రెవెన్యూ, అటవీ శాఖల భూముల మధ్య కూడా వివాదాలు నెలకొన్నాయని తెలిపారు.
వీటన్నింటినీ తేల్చేందుకు శాఖలు కలిసి సంయుక్త సర్వే చేపట్టాలని, క్షేత్రస్థాయిలో భూముల వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, రికార్డులు, మ్యాప్‌లు, సర్వే వివరాలను సమగ్రంగా సరిపోల్చాలని ఆదేశించారు. ఒక శాఖపై మరొక శాఖ నెట్టివేసే ధోరణి మారాలని, క్షేత్రస్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలను అక్కడే పరిష్కరించాలని, ఉన్నతస్థాయి నిర్ణయాలు అవసరమైతే వెంటనే రాష్ట్రస్థాయికి నివేదించాలని సూచించారు.
నేనే స్వయంగా పర్యవేక్షిస్తా
ఈ సమస్య పరిష్కార ప్రక్రియను తానే స్వయంగా పర్యవేక్షించనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రెండు శాఖల మధ్య సమన్వయం, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని అన్నారు. శాస్త్రీయంగా సరిహద్దులు నిర్ధారించడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు పునరావృతం కావని తెలిపారు. భూమి కొలతలు-భూ దస్త్రాల నిర్వహణ శాఖతో సంస్కరణలు అమలు చేస్తూ భూ రికార్డుల్లో పూర్తి పారదర్శకత, కచ్చితత్వం తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఈ సర్వేకు క్షేత్రస్థాయిలో రైతులు, ప్రజలు సహకరించాలని, జిల్లా, మండల స్థాయుల్లో రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, భూమి కొలతలు-భూ దస్త్రాల నిర్వహణ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

