బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి తమ పట్టు ఇంకా బలంగా ఉందని నిరూపించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గంలోని డివిజన్‌ల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీతో సమావేశం జరపనున్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ ఉప ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జూబ్లీహిల్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే డివిజన్‌ల వారీగా నాయకులను నియమించి, ప్రచారాన్ని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, నియోజకవర్గ నేతలతో పాటు కీలక నాయకులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందని, కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం త్వరలో ప్రకటించనుంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య సునీతను బరిలో దింపే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ పేర్లను పరిశీలిస్తోంది. బీజేపీ కూడా త్వరలో తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story