డ్రోన్లతో నిఘా, కేంద్ర బలగాల పహారా!

ఉదయం 7 గంటలకు శాంతియుతంగా మొదలైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది

4 లక్షల మంది ఓటర్లు.. 58 మంది అభ్యర్థుల భవితవ్యం నిర్ణయం

407 పోలింగ్ కేంద్రాలు.. 3 వేల పోలింగ్ సిబ్బంది, 2,400 పోలీసులు, 800 కేంద్ర బలగాలు విధులు

సమస్యాత్మక ప్రాంతాల్లో మూడంచెల భద్రత.. 139 ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్ల తీర్పు కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ సాగనుంది. ఉదయం 6:30 గంటలకే మాక్ పోలింగ్ పూర్తయింది. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎన్నికల సంఘం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

నియోజకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

కట్టుదిట్టమైన భద్రత.. సమస్యాత్మక కేంద్రాలపై ఫోకస్!

ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. 2,400 మంది పోలీసులు, 800 మంది పారామిలిటరీ కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. రహమత్‌నగర్, బోరబండ, యూసఫ్‌గూడా, శ్రీరామ్‌నగర్ వంటి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ జరుగుతోంది. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఎన్నికల అధికారులు డేగకన్ను వేసి ఉంటారు.

అంక్షలు అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు. మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేశారు!

నవోదయా కాలనీలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 290 వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు తప్పనిసరిగా ఓటు వేసి డెమోక్రసీని బలోపేతం చేయాలని ఆమె కోరారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఉప ఎన్నికలో ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. ఓటర్లు భారీ సంఖ్యలో తరలివస్తేనే ఎన్నికల పండుగ సార్థకమవుతుందని అధికారులు అంటున్నారు.

Updated On 11 Nov 2025 4:23 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story