రికార్డు స్థాయిలో దాఖలు

Jubilee Hills By-Election: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు నేడు చివరి రోజు. మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి నామినేషన్లను స్వీకరిస్తారు. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావచ్చని అంచనా. ఇప్పటి వరకు 94 మంది అభ్యర్థులు మొత్తం 127 సెట్ల నామినేషన్లను సమర్పించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి మాగంటి సునీత 3 సెట్లు వేశారు. బీఆర్ఎస్ నుంచే పి. విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ సమర్పించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున ఆయన భార్య ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు లంకల దీపక్ రెడ్డి మరో సెట్ వేయనున్నారు. నామినేషన్ల పరిశీలన రేపు జరగనుంది. ఈ నెల 24 వరకు ఉపసంహరణలకు అవకాశం ఉంది.

ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చింది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుని తన బలాన్ని మరోసారి నిరూపించుకోవాలని చూస్తోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ నుంచి మళ్లీ ఉత్సాహం పుంజుకుని, పూర్వ వైభవాన్ని తిరిగి సాధించాలని భావిస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో ఊపిరి పోసుకున్న బీజేపీ.. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం వైపు అడుగులు వేస్తోంది. అభ్యర్థులు మాగంటి సునీత, నవీన్ యాదవ్, లంకల దీపక్ రెడ్డి ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. డివిజన్లలో క్షేత్రస్థాయి ప్రచారాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రత్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో, ఎవరు విజేతగా నిలుస్తారనే ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది.

Updated On 21 Oct 2025 2:42 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story