మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 46 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేస్తున్నారు. నిన్నటినుంచి జూరాల ప్రాజెక్టులోకి 2లక్షల 19వేల 722 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. గేట్లు ఎత్తడం ద్వారా లక్షా 93వేల క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు దిగువకు వదులుతున్నారు. మరోవైపు.. జల విద్యుత్ కోసం.. మరో 23,668 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని అధికారులు చెప్పారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.401టీఎంసీల నీళ్లు ఉన్నాయి. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.800 మీటర్లుగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వచ్చే మరో రెండు రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.



కర్నాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించే కృష్ణానది ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మొదటి నీటి పారుదల ప్రాజెక్టు జూరాల. సాధారణంగా ప్రతీయేటా జూలై నుంచి సెప్టెంబర్ నెల వరకూ జూరాల ప్రాజెక్టుకు కర్నాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. దీంతో, ప్రాజెక్టు నిండిన సమయాల్లో.. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఆ సమయంలో జూరాల ప్రాజెక్టుకు సందర్శకులు భారీ సంఖ్యలో తరలివస్తారు. పెద్ద సంఖ్యలో ఉన్న గేట్ల నుంచి నీరు దిగువకు విడుదలయ్యే దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది.



పర్యాటకుల రద్దీ :



ఈసారి చాలా ముందుగానే.. అంటే మే నెలలోనే జూరాల ప్రాజెక్టు నిండిపోవడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఈ విషయం తెలుసుకున్న జనం భారీ సంఖ్యలో జూరాలకు తరలి వస్తున్నారు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా.. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు.



అయితే, ప్రతియేటా ఇలా.. పర్యాటకుల తాకిడి పెద్ద సంఖ్యలో ఉంటుందని తెలిసినా, యేటికేడూ పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరుగుతున్నా ఆ ప్రాంతంలో కనీస వసతులు మాత్రం లేవు. అక్కడ వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ గానీ, తాగేందుకు నీళ్లు గానీ, తినేందుకు తిండి గానీ, కనీసం చిరుతిళ్లు గానీ, సేద తీరేందుకు ఏర్పాట్లు గానీ అక్కడ కనిపించవు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పరిస్థితులు గుర్తించి జూరాల ప్రాజెక్టు దగ్గర అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వసతులు కల్పించాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.


Politent News Web4

Politent News Web4

Next Story