తేజస్వి వ్యాఖ్యలపై భగ్గుమన్న భారాస

క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌, హరీష్‌రావు డిమాండ్‌

K. T. Rama Rao and T. Harish Rao: పార్లమెంట్‌ సభలో తెలంగాణ ఏర్పాటు విషయంలో భాజపా నాయకులు మరోసారి తమ వ్యతిరేకతను బయటపెట్టారని భారాస నేతలు కేటీఆర్‌, హరీష్‌రావు తీవ్రంగా ఆరోపించారు. లోక్‌సభలో భాజపా ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై గులాబీ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటును భారత్‌-పాకిస్థాన్‌ విభజనతో పోల్చడం పూర్తి మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని వారు స్పష్టం చేశారు.

కేటీఆర్‌ స్పందిస్తూ, ‘‘భాజపా నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం వారి అలవాటుగా మారింది. ప్రధాని మోదీ నుంచి తేజస్వి వరకు అందరూ తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతుంటే, ఇక్కడి ఎనిమిది మంది భాజపా ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటు. కాంగ్రెస్‌ ఎంపీలు కూడా ఖండించకపోవడం దారుణం. తెలంగాణను కించపరచిన తేజస్వి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

హరీష్‌రావు మాట్లాడుతూ, ‘‘మహోన్నతమైన తెలంగాణ ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే. భాజపా అధిష్ఠానం ఈ వ్యాఖ్యలను ఖండించి, తమ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

భారాస నేతలు వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ తదితరులు కూడా తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story