Kaleshwaram Barrages: కాళేశ్వరం బ్యారేజీల పనులు పాత ఏజెన్సీలకే.. రూ.4,200 కోట్లతో పునరుద్ధరణకు ప్రణాళిక
ప్రణాళిక

Kaleshwaram Barrages: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి రూ.4200 కోట్లకు పైగా విలువైన పనులను పాత గుత్తేదారులకే ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. గురువారం గుత్తేదారులతో నిర్వహించిన సమావేశంలో నీటిపారుదలశాఖ కార్యదర్శి ఈ మేరకు సమాచారం ఇచ్చి పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పరిపాలన అనుమతులు, మంత్రివర్గ ఆమోదం తర్వాత అధికారిక ఆదేశాలు ఇస్తామని, ఈలోగా యంత్రాల సమీకరణ, క్యాంపుల ఏర్పాటుకు భూ సమీకరణ ప్రారంభించాలని పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజి ఏడో బ్లాక్ కుంగడం, పియర్స్ దెబ్బతినడం, పైపింగ్ తదితరాలపై విజిలెన్స్ విభాగం బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచే వసూలు చేయాలని సూచించింది. అయినప్పటికీ జాప్యం నివారించడానికి బ్యారేజి నిర్మించిన సంస్థతోనే పనులు చేయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పని పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం గతంలోనే రద్దు చేసింది.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులను కూడా పాత ఏజెన్సీలకే ఇవ్వనున్నారు. మంత్రులతో సీఎం సమావేశంలో మూడు బ్యారేజీల పరిస్థితి, నీటిని ఎత్తిపోయలేకపోవడానికి కారణాలు, పునరుద్ధరణ పనుల గురించి చర్చించారు. నీటిపారుదలశాఖ కార్యదర్శి శ్రీధర్ వద్ద జరిగిన సమావేశంలో ఎల్అండ్టీ, అప్కాన్స్, నవయుగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో చేసిన పనుల మరమ్మతులకు అయ్యే వ్యయాన్ని ఏజెన్సీలే భరించాలని, అదనపు పనులకు ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు వివరించారు.
స్టిలింగ్ బేసిన్ విస్తరణ, పియర్స్ విస్తరణ, సీసీ బ్లాకులు, ఆర్సీసీ డయాఫ్రం కట్ఆఫ్ వాల్ నిర్మాణం అదనపు పనుల జాబితాలో ఉన్నాయి. కేంద్ర జలసంఘం మేడిగడ్డ వద్ద 82 వేల క్యూమెక్కులే ఉండాలని స్పష్టం చేసింది. 72 వేలకు ఆమోదిస్తే ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించకుండా నాన్ ఓవర్‌ఫ్లో బ్యారేజిగా మార్చవచ్చని ప్రతిపాదన ఉంది. అయితే సీడబ్ల్యూసీ 82 వేల క్యూమెక్కులకే డిజైన్ ఉండాలని చెప్పింది. దీని వల్ల ఏడో బ్లాక్‌ను పూర్తిగా పునరుద్ధరించాల్సి ఉంటుంది.
పన్నులతో కలిపి మేడిగడ్డకు రూ.1883 కోట్లు, అన్నారంకు రూ.1205 కోట్లు, సుందిళ్లకు రూ.1160 కోట్లు అవుతుందని అంచనా. గత నిర్మాణ ఖర్చులో 60 శాతం వరకు పునరుద్ధరణకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చే వానాకాలం నాటికి పురోగతి సాధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తి పునరుద్ధరణకు మరింత వ్యయమవుతుంది. నిర్మాణ సంస్థలు ఈ భారాన్ని మోయడానికి ముందుకు వస్తాయా అనేది చూడాల్సి ఉంది.

