Kavitha Clarifies: బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లడంపై కవిత స్పష్టం
కవిత స్పష్టం

Kavitha Clarifies: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ తమపై రాజకీయ ఆరోపణలను తోసిపుచ్చారు. తాను తెలంగాణ ప్రజల గొంతుక అని, ఎవరి బొమ్మ కాదని స్పష్టం చేశారు. భారాస (బీఆర్‌ఎస్) పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ, కారణం చెప్పకుండా సస్పెండ్ చేయడం బాధకరమని, ఆత్మగౌరవం విషయంలో రాజీ పడనని అన్నారు.
జనంబాట కార్యక్రమంలో భాగంగా భువనగిరిలో పర్యటిస్తూ కవిత మాట్లాడుతూ... ‘‘నేను ఎవరో విడిచిన బాణం కాదు, తెలంగాణ ప్రజల బాణాన్ని. పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. భారాసలోకి తిరిగి చేరే ప్రశ్నే లేదు. ఈ మధ్య జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతాను’’ అని ప్రకటించారు.
భారాస హయాంలో జరిగిన తప్పిదాలపై మాట్లాడుతూ, ‘‘పార్టీలో కీలక పాత్ర పోషించినప్పటికీ నన్ను నిజామాబాద్‌కు మాత్రమే పరిమితం చేశారు. ఆ పాలనలో జరిగిన పొరపాట్లకు నేనూ బాధ్యత వహిస్తాను. ఆ పాపంలో నా భాగముంది. ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను’’ అని వెల్లడించారు.
తెలంగాణ జాగృతి సంస్థ 19 ఏళ్ల క్రితమే స్థాపించినదని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదని, ప్రాంతీయ భాష, సంస్కృతి పరిరక్షణతోపాటు సామాజిక సమస్యలపై పోరాటాలు చేసినదని గుర్తుచేశారు. ప్రస్తుతం జాగృతి ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.
కవిత పర్యటనలో భువనగిరిలోని స్వర్ణకారుల దుకాణాలను సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

