Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి సెప్టెంబర్‌ 18 లోపు హామీలు నెరవేర్చాలని అల్టిమేటం ఇచ్చారు. అదే సమయంలో మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జులను కూడా ప్రకటించారు.

బాగ్‌లింగంపల్లిలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ కవిత ‘‘మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్‌రెడ్డి ట్రేడ్‌ మార్క్‌. ప్రభుత్వ ఉద్యోగులంటే మీ బానిసలు కాదు. సెప్టెంబర్‌ 18లోగా వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. స్పందించకపోతే హైదరాబాద్‌ దిగ్బంధానికి సిద్ధం కావాలి’’ అని ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. మీ పోరాటానికి టీఆర్ఎస్ అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు.

గత 32 నెలలుగా డీఏ ఇవ్వకుండా ఉద్యోగుల కరువు భత్యాన్ని మింగేశారని, ఉపాధ్యాయులు, పోలీసుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె విమర్శించారు. 2003లో రిక్రూట్‌ అయిన ఉపాధ్యాయులు, పోలీసులకు ఓపీఎస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఖాళీలు భర్తీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగులను అభివృద్ధి డెవలపర్స్‌గా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో వినాయక చవితి సందర్భంగా కవిత మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఆర్ఎస్ ఇన్‌ఛార్జులను నియమించారు. ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కంటోన్మెంట్‌, కుత్బుల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, హుజూరాబాద్‌, పటాన్‌చెరు, దేవరకొండ, నాంపల్లి, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు బాధ్యుల్ని ప్రకటించారు. ఇప్పటికే 42 స్థానాలకు నియమించిన తర్వాత తాజా నియామకాలతో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జుల నియామకం పూర్తయింది.

Next Story