Kavitha Kalvakuntla: కల్వకుంట్ల కవిత జిల్లాల యాత్రకు శ్రీకారం
జిల్లాల యాత్రకు శ్రీకారం

Kavitha Kalvakuntla: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల యాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి తర్వాత ఈ యాత్రను ప్రారంభించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం. సామాజిక తెలంగాణ లక్ష్యంతో 33 జిల్లాలను కవర్ చేస్తూ ఫిబ్రవరి వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కవిత ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.
కవిత ఈ యాత్రలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో లేకుండా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బదులుగా, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల మధ్యకు వెళ్లాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా మేధావులు, విద్యావంతులతో సమావేశమై రాజకీయ వ్యూహాలపై చర్చించనున్నారు.
ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో, కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారనే పుకార్లు కూడా రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కవిత యాత్ర రాజకీయంగా కీలకమైనదిగా భావిస్తున్నారు. ప్రజల నుంచి మద్దతు పొందిన తర్వాత కవిత సొంత పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
