సీఎం నిజాలు చెప్పాలి!

ప్రభుత్వ విధానాలు, మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై తీవ్ర విమర్శలు


Kavitha Slams Government: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జరిగిన 'బూతుల వర్షం' ఆగిపోవడం తనకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

"మున్సిపల్ ఎన్నికల ప్రచారం చూస్తే.. పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగితే బాగుండేది" అని కవిత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు లోపిస్తున్నాయని, ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలపై చర్చే జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించారు.

సిద్ధిపేట మున్సిపాలిటీకి మాత్రమే నిధులు మంజూరు చేశారని, హరీష్ రావు, ముఖ్యమంత్రి మధ్య ఏముందో ప్రజలు అర్థం చేసుకోవాలని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించకుండా, ఆస్తులను అమ్మేస్తోందని ఆరోపించారు. రాబోయే బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

50 శాతం రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని వెల్లడించారు. రుణమాఫీ అంశంపై చర్చకు తాము సిద్ధమని, "సచివాలయాలకు రమ్మంటారా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాకు రమ్మంటారా?" అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిజాలు చెప్పాలని కోరారు.

ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు జాగృతి తరపున వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా 12వ తేదీన బంద్‌కు తమ సంస్థ మద్దతిస్తుందని పేర్కొన్నారు.

ఎంఐఎం పార్టీని 'పొద్దుతిరుగుడు పువ్వులా' అంటూ సెటైర్ వేశారు. "ఎవరు అధికారంలో ఉంటే వారి వెంట ఉంటుంది" అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒవైసీ సోదరులు రాయల తెలంగాణకు మద్దతిచ్చారని, కానీ రేవంత్ రెడ్డిని ఆర్‌ఎస్‌ఎస్ మనిషని అన్న ఒవైసీ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని కవిత గుర్తుచేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story